- ఇంత జరుగుతున్నా సర్కార్ స్పందించడం లేదు: హరీశ్ రావు
- రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులోనే ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. మళ్లీ అదే జిల్లాలో రాథోడ్ గోకుల్ అనే రైతు సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు.
రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. ‘‘రుణమాఫీ జరగలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనలు, ఆందోళనలు చేయొద్దంటూ పోలీస్ యాక్ట్ ప్రయోగించారు. రుణమాఫీ జరగక రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నరు. ఉన్న భూములు కుదువపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నరు.
వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నరు’’అని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘‘పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినం. అప్పుడు సర్కార్ దిగొచ్చి.. దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. ఇది బీఆర్ఎస్ విజయం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్లను తీర్చి సమస్యలు పరిష్కరించాలి. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలి’’అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.